తమిళనాడు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కరుప్పయ్య

  • తమిళనాడులో కొత్త ప్రభుత్వం
  • రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నూతన ఎమ్మెల్యేలు
  • ప్రొటెం స్పీకర్‌గా టీవీకే ఎమ్మెల్యే ఎం.వి. కరుప్పయ్య నియామకం
  • కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్
  • గతంలో అన్నాడీఎంకేలో పనిచేసి, ఇటీవలే విజయ్ పార్టీలో చేరిన కరుప్పయ్య
తమిళనాడు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఎమ్మెల్యే ఎం.వి. కరుప్పయ్య నియమితులయ్యారు. సోమవారం నాడు, కొత్తగా ఎన్నికైన సభ సమావేశం కానున్న నేపథ్యంలో, ఈ నియామకం జరిగింది. గతంలో అన్నాడీఎంకేలో కీలక నేతగా ఉన్న ఆయన, ఆ పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరారు.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, దశాబ్దాల డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యానికి తెరదించింది. ఆదివారం ఉదయం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రిగా విజయ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, "సింగా పెన్" ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, మాదకద్రవ్యాల నిరోధక ప్రత్యేక విభాగం ఏర్పాటుకు సంబంధించిన మూడు కీలక ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. ఈ పరిణామాల మధ్య, చోళవందాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కరుప్పయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఆయన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడంతో పాటు, సభ తొలి సమావేశాలను పర్యవేక్షిస్తారు.

1980 నుంచి అన్నాడీఎంకేలో ఉన్న కరుప్పయ్య, 2011లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, 2016, 2021 ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలో టీవీకేలో చేరారు. 2026 ఎన్నికల్లో టీవీకే అభ్యర్థిగా చోళవందాన్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 



Karuppiah
Tamil Nadu Assembly
Protem Speaker
MK Stalin
Vijay TVK
Tamilaga Vettri Kazhagam
Tamil Nadu Politics
Chozhawandan
Tamil Nadu Elections 2026
Rajendra Vishwanath Arlekar

More Telugu News